టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో విలన్‌గా ఎస్.జె.సూర్య ఖరారయ్యాడు. ఓ వైపు దర్శకుడిగా తన కెరీర్ కొనసాగిస్తున్న ఎస్.జె. సూర్య నటుడిగానూ రాణించే ప్రయత్నం చేస్తున్నారు.
గతంలో మహేష్ బాబు నటించిన ‘నాని’ చిత్రానికి సూర్య దర్శకత్వం వహించారు. ఇపుడు అదే మహేష్ బాబు సినిమాలో సూర్య విలన్ గా నటించబోతుండటం విశేషం. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టుకు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారు. మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ ముగియగానే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొదలు కాబోతోంది.
ఈ చిత్రాన్ని దాదాపు రూ. 90 కోట్ల బడ్జెట్ తో భారీగా తెరకెక్కించేందుకు మురుగదాస్ ప్లాన్ చేస్తున్నారు. ముంబై నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు. తెలుగు నిర్మాత ఠాగూర్ మధు కూడా ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. మహేష్ బాబు కెరీర్లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా కాబోతోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా మహేష్ బాబును ఈ సినిమాలో చూడబోతున్నాం. సౌత్ లో తన మార్కెట్ ను పెంచుకోవడంలో భాగంగానే మహేష్ బాబు ఏఆర్ మురుగదాస్ తో జతకట్టారు.