ప్రతి బియ్యం గింజ మీద తినేవారి పేరు రాసుంటుంది అంటారు. అలాగే సినిమాల్లోని ప్రతి పాత్ర మీద దాన్ని పోషించేవారి పేరు రాసుంటుంది అనుకుందాం కాసేపు! కొన్ని పాత్రలు ఎవరెవరి దగ్గరకో వెళ్లి చివరకు గమ్యాన్ని చేరుకుంటాయి. వాళ్లు వాటిని చక్కగా పోషించి పేరు తెచ్చుకుంటారు. చేజార్చుకున్న వారు బాధపడకపోయినా చిన్న వెలితి మాత్రం ఎప్పటికీ మిగిలిపోతుంది. అలాంటి ఐదుగురు నటీనటులు, వారు మిస్సైన సినిమాల గురించి ఇక్కడ..
శోభన్‌బాబు(పదహారేళ్ళ వయసు)

‘పదహారేళ్ళ వయసు’ తెలుగు సినిమాల్లో ఒక మరుపురాని చిత్రం. తమిళంలో కమల్‌హాసన్, శ్రీదేవి నటించగా, తెలుగులో కమల్‌హాసన్ బదులు చంద్రమోహన్ నటించారు. అమాయకుడిగా ఉంటూ మల్లి (శ్రీదేవి) పై ప్రేమ చూపే ముచ్చటైన పాత్ర అది. ఈ పాత్రను తెలుగులో తాను వేయాలని శోభన్‌బాబు అనుకున్నారు. అయితే గోచి పెట్టుకొని, అమాయకంగా తిరిగే డీగ్లామర్ రోల్ ఆయనకు సరిపోదని కొందరు సలహా ఇవ్వడంతో ఆ పాత్ర చంద్రమోహన్‌కు దక్కింది.
రాధ (సితార)

తను రాసిన ‘మహల్లో కోయిల’ నవలని పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లో ‘సితార’ సినిమాగా తీశారు దర్శకుడు వంశీ. నవలలో ఆయన రాసిన హీరోయిన్ పాత్రకు రాధ అయితే బాగుంటుందని అనుకున్నారు. అప్పటికే తమిళంలో రాధ ఫేమస్ హీరోయిన్. తెలుగులో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆమెను సంప్రదించినప్పుడు రెమ్యూనరేషన్ ఎక్కువ అడిగారన్న కారణంతో మరో హీరోయిన్‌ని చూడమన్నారట నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. ఆ తర్వాత భానుప్రియ ఈ సినిమా చేసి, అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు.
రావు గోపాలరావు (అహనా పెళ్లంట)

‘అహనా పెళ్లంట’ సినిమాలో కోట శ్రీనివాసరావు పోషించిన పిసినారి లక్ష్మీపతి పాత్ర ఎంతో ప్రఖ్యాతి పొందిందో అందరికీ తెలిసిందే! దర్శకుడు జంధ్యాల ముందుగా ఆ పాత్రకు రావు గోపాలరావు అయితే బాగుంటుందని అనుకున్నారు. అయితే పిసినారితనం చూపడం, బనియన్ మీదే సినిమా అంతా ఉండటం లాంటి అంశాలు ఆయనకు సెట్ కావన్న ఉద్దేశంతో కోటను రంగంలోకి దింపారు. ఆయన కెరీర్లో అది మైలురాయిగా నిలిచిపోయింది.
రోజా (హలో బ్రదర్)

‘హలో బ్రదర్’ సినిమా ఆల్ టైం ఎంటర్‌టైనర్. అందులో ఇద్దరు హీరోయిన్లు. వారిలో ఒక పాత్ర కోసం ముందుగా రోజాను సంప్రదించారు. అయితే అప్పటికి ఆమె తన సొంత సినిమా ‘సమరం’ షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల ఈ చిత్రాన్ని వదులుకున్నారు. ఈ విషయాన్ని ఆమే కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు.
మమ్ముట్టి (ప్రస్థానం)

తెలుగులో మమ్ముట్టి చేత నటింపజేయాలని ఎంతోమంది దర్శకులు ప్రయత్నించారు. ‘స్వాతికిరణం’ తర్వాత అనేక తెలుగు ఆఫర్లు వచ్చినా ఆయన ఒప్పుకోలేదు. చాలా గ్యాప్ తర్వాత ఇటీవల ‘యాత్ర’ సినిమాలో నటించారు. 2010లో దేవకట్టా దర్శకత్వంలో వచ్చిన ‘ప్రస్థానం’లో సాయికుమార్ పోషించిన పాత్రకోసం ముందుగా మమ్ముట్టిని అడిగారు. హీరోకు తండ్రిగా తాను చేయనని అనడంతో ఆ పాత్ర సాయికుమార్‌ని చేరి ఆయన కెరీర్లో మర్చిపోలేని చిత్రంగా నిలిచింది.