సుప్రీమ్ హీరో సాయితేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ప్రేమంటే ఓ లైలా మజ్నూలా, దేవదాసు-పార్వతిలా..ఓ రోమియో జూలియట్‌లా అదో మాదిరిగానే ఉండాలి అంటూ వైష్ణవ్‌తేజ్ డైలాగ్స్ తో మొదలైన ఈ ట్రైలర్ ఇద్దరు ప్రేమికుల మద్య పరువు అఘాదం సృష్టించినట్లు చూపిస్తున్నారు.

హీరోయిన్ తండ్రి పాత్రలో విజయ్ సేతుపతి పవర్ ఫుల్ డైలాగ్స్ తో భయంకరంగా విలనీజం పండించినట్లు ఉంది. సముద్రతీర ప్రాంతంలోని గ్రామంలో ఓ పేదింటి అబ్బాయికీ, ఓ సంపన్న కుటుంబానికి చెందిన కాలేజీ అమ్మాయికీ మధ్య ఏర్పడే ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే పాయింట్‌తో ఈ చిత్రం ఉండనున్నట్లుగా తెలుస్తోంది.

సుకుమార్ రైటింగ్స్ సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రూపొందించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు కూడా దర్శకుడు బుచ్చిబాబు సానా అందించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించారు.