బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో ఏపీలో భారీగా పంట నష్టం జరిగింది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో అనేకచోట్ల భారీ నుంచి అతిభారీగా, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురిసాయి. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా శనివారం నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించింది. రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
తెలంగాణలో కూడా తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో హైదరాబాద్ నగరంలో వాతారవణం ఒక్కసారిగా మారిపోయింది. గత రెండ్రోజులుగా నగరాన్ని మేఘాలు కమ్మేశాయి. రెండ్రోజుల క్రితం వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండగా.. ప్రస్తుతం సాధారణ వాతావరణం నెలకొని ఉంది.
తమిళనాడులో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రజలు వరదలతో నిండిన వీధుల్లో వెళుతున్న వీడియోలు బయటకు వచ్చాయి.ఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా నదులు, అటవీ మార్గాల్లో శబరిమల యాత్రికుల కార్యకలాపాలపై నిషేధం విధించారు. కేరళలోని పతనంతిట్ట, ఇడుక్కి జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో శబరిమల యాత్రికులు నదుల్లోకి వెళ్లడం లేదా స్నాన ఘాట్‌లను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.