తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 6న భేటీ కానున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలతో పాటు విభజన సమస్యలు, ఉద్యోగుల విభజన తదితర అంశాలు కొలిక్కివచ్చే అవకాశం ఉంది. ఇక తెలుగు సీఎంల భేటీకి జ్యోతిబా ఫూలే భవన్ వేదిక కానుంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల సీఎంలు ఈ భేటీలో ఏఏ అంశాలపై చర్చించాలనే దానిపై ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి రాష్ట్ర విభజన తరువాత ఏపీ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పని చేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనపై చర్చలు జరిగాయి. కానీ ఆ సంప్రదింపులకు మధ్యలోనే బ్రేక్ పడింది. ఆ తర్వాత సమావేశాలు జరగలేదు. ఇక కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ముందడుగు పడలేదు.
తాజాగా రేవంత్,బాబు భేటీ కానుండటంతో ఈసారైనా సమస్యలు కొలిక్కి వస్తాయని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం షెడ్యూల్ సంస్థల ఆస్తులు , ఉద్యోగుల విభజన ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో చర్చ జరిగిన మాదిరిగానే తూతూ మంత్రంగా సీఎం భేటీ ఉంటుందా? లేదా ఇరు రాష్ట్రాల సమస్యలపై ఓ క్లారిటీకి వస్తారా అన్నది తెలియాల్సి ఉంది.