తెలుగు రాష్ట్రాల్లో అధ్యక్షుడి ఎంపిక బీజేపీకి తలకు మించిన భారంగా మారింది. రేసులో చాలామంది నేతలు ఉండటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది. ముఖ్యంగా ఏపీలో బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్న నేతల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎవరిని ఎంపిక చేస్తారోనని పార్టీ నేతలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే తాజాగా రాయలసీమ కు చెందిన సీనియర్ పార్టీ నేతకు రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రధాని మోదీ టీం ఖరారు చేసినట్లు సమాచారం. అనంతపురం కు చెందిన విష్ణు వర్ధన్ రెడ్డి పేరు పైన హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అనుబంధ ఏబీవీపీలో పనిచేసిన విష్ణు..ఆ తర్వాత అంచెలంచెలుగా పార్టీలో ఎదిగారు. అంతేగాదు పార్టీ వాయిస్‌ను బలంగా వినిపిస్తారనే పేరుంది.
ఈ నేపథ్యంలోనే విష్ణు పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేశారు కూడా. ఈ నేపథ్యంలోనే విష్ణు పేరు తెరపైకి వచ్చింది. వాస్తవానికి తొలుత ఉత్తరాంధ్ర నుంచి బీసీ వర్గానికి చెందిన ఇద్దరు పేర్లు తుది పరిశీలన వరకు వచ్చాయి. అయితే పార్టీని దూకుడుగా ముందుకు తీసుకెళ్లే నేతకు పదవి ఇవ్వాలని భావిస్తున్నారు. ఓ దశలో ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరిని మరో ఏడాది పాటు పొడిగించే ప్రతిపాదన పైన చర్చ జరిగినా తాజాగా రాయలసీమకు చెందిన నేతకు పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెడతారని తెలుస్తోంది.