పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా జరపాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 3 గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబర్ 15వ తేదీన పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం జరపాలని నిర్ణయం చెప్పారు. ఐటీ, టెక్స్టైల్, మారీటైమ్ పాలసీలకు మంత్రివర్గం ఆమోదం తెలపగా పర్యాటక, స్పోర్ట్స్ పాలసీల్లో పలు సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ టెక్స్‌టైల్స్ గార్మెంట్ పాలసీకి ఆమోద ముద్ర పడింది.
ఇక కీలకబైన జలజీవన్ మిషన్ సక్రమ వినియోగంలో జాప్యంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ డీపీర్ ల స్థాయి దాటి ఎందుకు ముందుకెళ్లట్లేదని అధికారుల్ని నిలదీశారు. బ్యూరోక్రసీ డిలే వల్లే మంచి పథకం సద్వినియోగం కావట్లేదని చెప్పారు. పులివెందుల, ఉద్దానం, డోన్ లో తాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిర్ణయం తీసుకున్నారు. లిక్కర్, ఇసుక మాఫియాలను అరికట్టామని, చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవీ పరిష్కరిస్తామని చెప్పారు.