సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఢిల్లీకి వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, ఏపీకి రావాల్సిన నిధులు వంటి అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చించనున్నారు చంద్రబాబు. ఇవాళ సాయంత్రం 5గంటలకు సచివాలయం నుంచి గన్నవరం బయలుదేరనున్న చంద్రబాబు…అక్కడి నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు.
రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు, నిధుల సమీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రొత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం,రోడ్లు, పోలవరం, ఆర్థిక సాయం వంటి అంశాలే లక్ష్యంగా కేంద్ర మంత్రులను కోరనున్నారు.
అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఢిల్లీ పెద్దలకు వివరించి వీలైనంత ఎక్కువ సాయం చేయాలని కోరనున్నారు. తన పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, గడ్కరి, నడ్డా, సీఆర్ పాటిల్‌లను కలవనున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.