తమిళనాట కొత్త పొలిటికల్ పార్టీ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించారు నటుడు విజయ్. ఇక తాజాగా తొలిసారి మహానాడును నిర్వహించారు విజయ్. ఎవరూ ఊహించని విధంగా విల్లుపురం జిల్లాలోని విక్రవాండి సమీప వి.సాలైలో జరిగిన ఈ సభకు 10 లక్షలకు పైగా జనం వచ్చారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం కాగా సభకు వచ్చిన వారికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ వైరల్‌గా మారాయి.
ఇక విజయ్ సభ సక్సెస్ తర్వాత స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎంతోమంది సాధువులు, సిద్ధులకు నెలవైన తమిళనాడులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నటుడు విజయ్‌కి నా హృదయపూర్వక అభినందనలు అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
తనకు రాజకీయ అనుభవం లేకపోవచ్చని.. కానీ పాలిటిక్స్ విషయంలో ఓ క్లారిటీ ఉందన్నారు విజయ్. ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తాం అని.. తమిళనాడు గడ్డకు ఇవి రెండు కళ్లలాంటివి అని తెలిపారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా భావజాలం అని స్పష్టం చేశారు విజయ్. పెరియార్ ఈవీ రామస్వామి, కె.కామరాజ్, బాబాసాహెబ్ అంబేడ్కర్, వేలు నాచియార్, అంజలి అమ్మాళ్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. 2026లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.