ఏపీలో మందుబాబులకి షాకిచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వైన్స్ షాపులకు మంగళం పాడి.. ఇష్టారాజ్యంగా ప్రతి వాడలో బెల్ట్ షాపులను తెరచిన కూటమి ప్రభుత్వం.. తాజాగా మందుబాబుల్ని మత్తులో ఉంచి సైలెంట్‌గా అన్ని బ్రాండ్ల మద్యం ధరలు 10-20 శాతం పెంచింది. తద్వారా కూటమి నేతల జేబులు నింపబోతున్నారు చంద్రబాబు. మద్యం ధరలు తగ్గిస్తానన్న హామీకి 9 నెలల్లోనే మంగళం పాడేసి.. మందుబాబుల జేబులకి చిల్లు పెట్టారు.
లిక్కర్ ధరల పెంపుపై వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. చౌక మద్యం అని చెప్పి ఇవాళ ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకునేలా చేశాడు. గతంలో మద్యం ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. ఇప్పుడు తెలుగు తమ్ముళ్ల జేబులోకి పోతోందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి. లిక్కర్ స్కామ్‌లో భాగంగా ప్రభుత్వ ఆధీనంలో నడిచే మద్యం దుకాణాలను ఎత్తేశారు అని ఆరోపించారు.
సొంత జేబులు నింపుకోవడం కోసం మద్యం దుకాణాలు తనవాళ్లకు కేటాయించాడు..టెండర్లలో ఒక మార్జిన్ పెట్టి ఇప్పుడు దాన్ని పెంచడం చంద్రబాబు స్కామ్ అని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వంలో మద్యం డోర్ డెలివరీ జరుగుతుంది… మద్యం అమ్మకాలు పెంచేందుకు లక్కీడిప్‌లు తీయిస్తున్నారు అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ రాలేదు కానీ వాట్సాప్ లిక్కర్ సరఫరా సమర్థవంతంగా జరుగుతోందని ఎద్దేవా చేశారు.
దుకాణదారులకు నష్టం కలగకూడదని మద్యం వినియోగదారులపై భారం వేశాడట చంద్రబాబు… లిక్కర్ సిండికేట్ విక్రయించే ప్రతి సీసా మీదా చంద్రబాబుకు 5 రూపాయలు ముడుపుల ఒప్పందం కుదిరిందన్నారు. కరకట్టకు నోట్ల వరద పారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.