కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న మోడీ భజన, జగన్‌పై తిట్ల దండకం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రాజధాని ప్రాంత ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ పనులు లేక మరోవైపున రాజధానిలో ఉపాధి దొరకక సతమతమవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆదాయం తగ్గింది.. పన్నులు, రుణ భారాలు, ఒత్తిళ్లు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడు సంవత్సరాల మంచినీటి ఛార్జీలు రూ.4800 ఒకేసారి చెల్లించాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
అలాగే జగన్ హయాంలో ఇళ్ల స్థలాలు లేని వారికి ఇచ్చిన ప్లాట్లు రద్దు చేశారనీ, మళ్లీ కొత్తగా స్థలాలు కేటాయించలేదు అని దుయ్యబడుతున్నారు. సూర్యఘర్ పథకంలో దళితుల ఇళ్లకు సోలార్ విద్యుత్ అందిస్తామని చెబుతూ, సోలార్ కనెక్షన్లు తీసుకోకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని మండిపడుతున్నారు.
రాజధాని శంకుస్థాపనకు వచ్చిన సందర్భంలో మోడీ.. నిధులు ఇవ్వకుండా చెంబుడు నీరు, గుప్పెడు మట్టితో సరిపెట్టారు అని ఇప్పుడు రాజధానికి నిధులు ఇవ్వకుండా అరకోర డబ్బులతోనే సరిపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మోడీ భజన ఆపి.. రాష్ట్ర ప్రజల తరఫున రాజధాని నిధులకై కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచిస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా ఉచిత విద్య, వైద్యం హామీలు అమలు చేయాలని, మంచినీటి చార్జీలు, ఇళ్ల రుణ బకాయిలు, విద్యుత్ ఛార్జీల బకాయిలు పేరుతో వేల రూపాయలు బలవంతంగా వసూలు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.