ఏపీని వరదలు ముంచెత్తగా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థపై చర్చ మొదలైంది. వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు విజయవాడ ప్రజలు. మూడు రోజులుగా అష్టకష్టాలు పడుతున్నా.. తొంగిచూసే దిక్కులేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా అప్పట్లో వైఎస్ జగన్ ఇంటింటికీ సాయం చేశారని గుర్తుచేసుకుంటూ భావోద్వేగం అయ్యారు. ప్రస్తుతం ఉంది చెత్త పాలనంటూ వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడలో ఎటు చూసినా దయనీయ పరిస్థితులే కనిపిస్తున్నాయి. వరద ముంపుతో ఇళ్లు నీట మునిగి స్థానికులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాలనీలు వదిలేసి సుదూర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. వరద బాధితుల సహాయ సహకారాలు అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు వరద బాధితులకు సహాయక చర్యలు అందించడంలో వైసీపీ శ్రేణులు ముందున్నాయి. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతానికి బోటులో వెళ్లి బాధితుల్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు మ్మెల్సీ ఎండీ రుహుల్లా. బాధితుల్ని ఆదుకోవడంలో కూటమి నేతలు అలక్ష్యంలో ఉండగా చొరవ తీసుకుని సాయం చేశారు రుహుల్లా.
వరదల్లో తమను పట్టించుకునే నాథుడే లేడని వరద ముంపు బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా తినడానికి తిండిలేక పస్తులుంటున్నామని, కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేవని కంటనీరు పెట్టుకుంటున్నారు. పసి పిల్లల పాల కోసం తల్లులు నిరీక్షణ వర్ణణాతీతం.