ఆంధ్రప్రదేశ్ విద్యార్థి అద్భుతాన్ని సృష్టించాడు. తన మేధస్సుతో ప్రపంచంలోనే అతి చిన్న AI సర్టిఫైడ్ ప్రొఫెషనల్‌గా రికార్డు సృష్టించాడు సిద్దార్థ్. ఏపీ మూలాలున్న 14 ఏళ్ల ఎన్నారై విద్యార్థి సిద్దార్థ్ నండ్యాల ఆరోగ్య రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణను కనుగోన్నాడు. కేవలం ఏడు సెకన్లలో హార్ట్ డిసీజ్‌ను గుర్తించే AI-ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేసి, గుంటూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH)లో విజయవంతంగా పరీక్షించాడు.
సిద్దార్థ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలుసుకొని, తన ఆవిష్కరణను ప్రదర్శించాడు. ఈ యాప్ అత్యంత వేగంగా, ఖచ్చితంగా గుండె సంబంధిత వ్యాధులను గుర్తించగలదని నిరూపించుకుంది. ARM, Oracle సంస్థల నుంచి ప్రపంచంలోనే అతి చిన్న AI సర్టిఫైడ్ ప్రొఫెషనల్‌గా గుర్తింపు పొందారు సిద్దార్థ్.
ఈ కొత్త ఆవిష్కరణ తక్కువ ధరకు అందుబాటులో ఉండడంతో, ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ T-Works ఫైనల్ స్టేజ్‌లో ఉండగా త్వరలో మార్కెట్‌లోకి రిలీజ్ కానుంది.
సిద్దార్థ్ తండ్రి మహేష్ నండ్యాల అమెరికాలో AI-ఆధారిత స్టార్టప్‌లను స్థాపించిన ఎంట్రప్రెన్యూర్. తల్లి శ్రీలతా జ్యువెలరీ వ్యాపారం నడుపుతోంది. తల్లి ప్రోత్సాహంతో సిద్దార్థ్ ఏడేళ్ల వయసులో మొదటిసారి ఎలక్ట్రానిక్స్ కిట్ ఉపయోగించడం మొదలుపెట్టాడు. అతడి ఆవిష్కరణ మార్కెట్‌లోకి వస్తే సులభతరంగా గుండె జబ్బులను గుర్తించవచ్చు.