తిరుమలలో కూటమి ప్రభుత్వం ఘోర అపచారానికి పాల్పడిందన్నారు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన భూమన.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుమలలో ఎన్నో దురాగతాలు జరుగుతున్నాయనేది డీఎఫ్ఓ వివేక్ అనే అధికారి ప్రకటనతోనే బయటపడ్డాయి అన్నారు.
పవిత్రమైన పాపవినాశనం జలాల్లో బోటింగ్ నిర్వహంచడం శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని మండిపడ్డారు. తిరుమల చరిత్రలోనే తొలిసారిగా బోటింగ్ జరిగిందని…. దీనిని కూడా ఎల్లోమీడియా కప్పిపుచ్చాలనే ప్రయత్నం చేసిందన్నారు.
ఇటీవల తిరుమలకు సీఎం చంద్రబాబు వచ్చినప్పుడు రాష్ట్రంలో టూరిజాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే ఆలోచనలో భాగంగా ఆలయాల్లో టూరిజాన్ని ప్రోత్సహిస్తానని ప్రకటించారు. టూరిజం అంటేనే విలాసం, విహారం. ఆధ్యాత్మిక యాత్రలు వేరు, టూరిస్ట్ యాత్రలు వేరు అన్నారు. టూరిజం కోసం ట్రైల్ రన్ అని ఒకరు, కాదూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిఘాకోసం అంటూ అటవీశాఖ అధికారి ప్రకటించడంపై టీటీడీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు భూమన.
గత కొంతకాలంగా తిరుమల పవిత్రతను దెబ్బతీసే ఇటువంటి ఘటనలు జరుగుతున్నా పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదు అని దుయ్యబట్టారు. సనాతనధర్మాన్ని మౌనంతో సాధించాలని ఆయన భావిస్తున్నారని అనుకోవాలా? ..ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు?చెప్పాలని డిమాండ్ చేశారు భూమన.