పోలవరం ప్రాజెక్టు అంటే గుర్తుకొచ్చేది వైఎస్‌ఆరే అన్నారు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ.మంగళవారం శాసన మండలిలో పోలవరంపై చర్చ సందర్భంగా మాట్లాడిన బొత్స.. పోలవరం పై మంత్రి నిమ్మలరామానాయుడు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడే అర్హత, హక్కు వైసీపీకి మాత్రమే ఉందని… పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారా లేదా మాకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆయన పట్టుబట్టారు. మీరు చెప్పే సమాధానాల్నే మేము ప్రశ్నిస్తున్నామని ధ్వజమెత్తారు. పోలవరం అంటే మొదట గుర్తుకు వచ్చేది వైఎస్ అని.. పోలవరం గురించి మాట్లాడాలంటే వైసీపీనే మాట్లాడాలన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో చేనేత రంగాన్ని ఆదుకున్నామని… చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో విపక్ష సభ్యులను మాట్లాడకుండా పదే పదే అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు.