డీఎస్పీని సస్పెండ్ చేస్తే పాపం మాసిపోతుందా చెప్పాలన్నారు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ. మీడియాతో మాట్లాడిన బొత్స…మిగతా సెంటర్లలో తొక్కిసలాటలకు చర్యలుండవా? చెప్పాలన్నారు. టీటీడీ ఛైర్మన్, ఈఓల జోలికి సీఎం ఎందుకు వెళ్లడం లేదు?..వారి సమన్వయ లోపంతోనే ప్రమాదమని స్పష్టంగా తెలుస్తోందన్నారు.
చంద్రబాబు ఎందుకంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు? అని సూటిగా ప్రశ్నించారు. సమీక్ష నిర్వహించడానికి కూడా సీఎంకి తీరిక లేదా? చెప్పాలన్నారు బొత్స. పవన్‌కళ్యాణ్ క్షమాపణలు చెప్పి ఊరుకుంటే ఎలా?…ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలన్నారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఛైర్మన్, ఈవో మధ్య సమన్వయ లోపంతోనే ఘటన జరిగిందని పత్రికలు, డిప్యూటీ సీఎం చెబుతున్నా వారిపై చర్యలు తీసుకోవడంలో సీఎం చంద్రబాబు ఎందుకంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గత రెండు రోజులుగా పత్రికల్లో వచ్చిన వార్తలను పరిగణనలోకి తీసుకుని సుమోటో కేసుగా స్వీకరించి విచారణ జరపాలన్నారు బొత్స.
తొమ్మిది కేంద్రాల్లో దర్శనం టికెట్ల పంపిణీ చేపడితే మూడు చోట్ల జరిగిన తొక్కిసలాటల్లో భక్తులు ప్రాణాలు కోల్పోయారు. కానీ ప్రభుత్వం మాత్రం ఒక సంఘటనలోనే డీఎస్పీని బాధ్యుడ్ని చేస్తూ సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుందని విమర్శించారు.