విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు సంచులతో గెలవాలని టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు వైసీపీ నేత, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ. నర్సీపట్నం నియోజకవర్గ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన బొత్స..సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. వైసీపీకి 600 మంది సభ్యుల బలం ఉన్నా కేవలం 200 మంది సభ్యుల బలంతో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టడం దారుణమన్నారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీల గౌరవాన్ని కాపాడే బాధ్యత మాదని….ఓట్లు కొనడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు అన్నారు. గతంలో తమకు టీడీపీ కంటే 50 ఓట్లు తక్కువగా ఉంటే పోటీ నుంచి తప్పుకున్నాం అని గుర్తు చేశారు. డబ్బులు, పదవులు ఆశ చూపి ప్రలోభాలకు పాల్పడటం సరికాదన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం ఖాయమని తేల్చిచెప్పారు.
ఎన్నికల తర్వాత రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని చెబుతున్న చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఎన్నికలకు ముందు చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. జగన్ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారని ..వైసీపీ గుర్తు మీద గెలిచిన ప్రతి నాయకుడు పార్టీకి లాయల్ గా ఉంటారని చెప్పారు. అలాగే విశాఖ స్టాండింగ్ కౌన్సిల్ లో నిలబడ్డ 10 మంది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడబోతున్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. మంచి మెజారిటీతో గెలుస్తారని తెలిపారు.