ఏపీ అసెంబ్లీ సాక్షిగా ఎన్నికల మేనిఫెస్టోలో తాము ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ సాధ్యం కాదని తెలిపారు సీఎం చంద్రబాబు. అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, ప్రస్తుత ఏపీ ఆర్థిక పరిస్థితి చూస్తుంటే సూపర్ సిక్స్ అమలు చేయలేమని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి చంద్రబాబు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వాస్తవానికి సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రకటించినప్పుడే అందరిలో నెలకొన్న సందేహం ఇదే. ఈ హామీల అమలుకు ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుండి తెస్తారు అని సామాన్య ప్రజానీకం దగ్గరి నుండి మేధావుల వరకు ప్రశ్నించారు. కానీ తాము అధికారంలోకి వస్తే చేసి చూపిస్తామని మాట ఇచ్చారు చంద్రబాబు.
కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ విధ్వంసానికి గురైందని, జగన్ చేసిన పాపాలతో ఆర్థికంగా నష్టపోయిందనే పదేపదే చెబుతూ హామీల అమలు నుండి పక్కకు తప్పుకునే ప్రయత్నం చేయడం ప్రజలకు అర్ధమవుతోంది. ఇందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టకుండా శ్వేతపత్రాల పేరుతో కాలం వెల్లదీస్తున్నారని పలువురు ఆరోపించే పరిస్థితి నెలకొంది.
ఏపీ బడ్జెట్ ఎంత లెక్కలు కట్టినా మూడు లక్షల కోట్లు దాటే పరిస్థితి లేదు. కానీ సూపర్ సిక్స్ పేరు టీడీపీ కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ఆరు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ అవసరమయ్యే పరిస్థితి ఉండటంతో చంద్రబాబు పక్కకు తప్పుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి నెలకొంది.