ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరపున ప్రమోద కుమార దుబే, సీఐడీ తరపున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇద్దరి మధ్య వాడివేడిగా వాదనలు జరుగగా ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును సోమవారానికి రిజర్వ్ చేశారు.
వాస్తవానికి గురువారమే చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు పూర్తి కాగా ఇవాళ సీఐడీ తరపున సుధాకర్ రెడ్డి తన వాదనలను బలంగా వినిపించారు.చంద్రబాబు బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసోవాల్సి ఉందని అందుకే ఆయన్ని మరిన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయితే ఇప్పటికే ఓసారి చంద్రబాబును కస్టడీకి ఇచ్చారని రెండోసారి ఇవ్వాల్సిన అవసరం లేదని బాబు తరపు లాయర్ వాదించారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో దర్యాప్తు కీలక దశలో ఉందని… ఈ దశలో బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు సుధాకర్ రెడ్డి. చంద్రబాబు బ్యాంకు లావాదేవీలపై విచారణ జరపాల్సి ఉందని…రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు సహకరించలేదని తెలిపారు. మరోసారి కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – టీడీపీ ఆడిటకర్ ఒక్కరేనని న్యాయస్ధానం దృష్టికి తీసుకొచ్చారు సుధాకర్ రడ్డి.