కొంతకాలంగా నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదని పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు టీడీపీ అధినేత.
కొంతమంది తమ వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దుతున్నారని ఇది సరికాదన్నారు. ఇలాంటి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూటమి నేతలు కూర్చుని చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతేగాదు లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని మీడియా ఎదుట ఎలాంటి బహిరంగ ప్రకటన చేయవద్దని తెలిపారు. దీంతో టీడీపీ నేతలు ఖంగుతిన్నారు.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మ.. లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత సీనియర్ నేతలు సైతం ఇదే పల్లవి అందుకోవడంతో టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా మాట్లాడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరిస్థితి చేయిదాటక ముందే చక్కదిద్దే పనిలో పడ్డారు చంద్రబాబు.
కొంతమంది సీనియర్‌లు సైతం చంద్రబాబు వాదనతో ఏకీభవించారు. ఎందుకంటే లోకేశ్‌కు ఇంకా రాజకీయంగా పరిపక్వత రావాల్సి ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. లోకేశ్‌కు కీలక బాధ్యతలు ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదని చెప్పడంతో మెజార్టీ నేతల అభిప్రాయం మేరకే టీడీపీ అధినేత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. మొత్తంగా డిప్యూటీ సీఎం కావాలని ఆశపడ్డ చినబాబుకు ఆదిలోనే చెక్ పడిందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు.