టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎప్పుడూ రైతులంటే చిన్నచూపే. అందుకే సీఎం అయిన ప్రతిసారి ఏదో రూపంలో రైతుల ఊసురు పోసుకుంటూనే ఉంటారు చంద్రబాబు. నాటి బషీర్ బాగ్ కాల్పుల ఉదంతం నుండి నేటి వరకు చంద్రబాబు పాలనను గమనిస్తే ఇదే అర్థం అవుతుంది.
తాజాగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్ల పాటు ఉచిత పంటల బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేశారు. నోటిఫై చేసిన ప్రతీ పంటకు సాగైన ప్రతీ ఎకరాకు యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ రైతులకు పూర్తి స్థాయిలో బీమా రక్షణ కల్పించారు. ఇందుకోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేశారు జగన్.
రైతుల తరపున వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ.3,022.26 కోట్ల ప్రీమియం మొత్తాన్ని బీమా కంపెనీలకు చెల్లించారు. కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023–24 సీజన్‌లో రైతుల తరపున ప్రీమియం మొత్తం రూ.930 కోట్లు చెల్లించకుండా ఎగ్గొట్టడం వలన ఆ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులతో పాటు, భారీ వర్షాలు, తుపాన్‌ల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు రూ.1,385 కోట్ల పరిహారం అందకుండా పోయింది.
దీనికి తోడు అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తున్నా.. సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు ప్రతీ రైతుకు ఇస్తానన్న రూ.20 వేల పెట్టుబడి సాయంలో ఒక్క పైసా కూడా అందించలేదు. దీంతో ఖరీఫ్, రబీ సీజన్‌లలో పెట్టుబడి కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి రూ.3–5 వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనికి తోడు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేయడం దుర్మార్గమని రైతులు మండిపడుతున్నారు. ఉచిత పంటల బీమా పథకం రద్దు చేసే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.