సమాజానికి ఒక సవాలుగా మారిన సైబర్ నేరాలను నియంత్రించడంలో తెలంగాణను దేశానికే రోల్ మాడల్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆకాశమే హద్దుగా కొత్త రూపాలు సంతరించుకుంటున్న సైబర్ నేరాలను అరికట్టడంలో పరిమితమైన విధానాలతో కేవలం ఒక రాష్ట్రం చేసే ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వవని, రాష్ట్రాలన్నీ సమన్వయంతో దేశం ఒక యూనిట్‌గా పనిచేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.
హెచ్‌ఐసీసీలో సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ -2025 ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. సైబర్ నేరాలను నియంత్రించడంలో జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని కేంద్ర ప్రభుత్వం కితాబిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. మారుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని, తొలి ప్రయత్నంగా అందుకు అవసరమైన ఒక వారధిని నిర్మించేందుకు చొరవ తీసుకున్నందుకు తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగాన్ని ముఖ్యమంత్రి అభినందించారు.
సైబర్ క్రిమినల్స్ ఇటీవలి కాలంలో దాదాపు 22 వేల కోట్ల రూపాయలను కాజేసినట్టు అంచనాలు వచ్చాయని, ప్రజల జీవన స్థితిగతులను, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ఇలాంటి ప్రమాదకరమైన పరిణామాలను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో పాటు ఫేక్‌న్యూస్, సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచార వ్యాప్తి సమాజానికి చేటు కలిగిస్తున్నాయని అన్నారు.
అకాశమే హద్దుగా ప్రతి క్షణం ఏదో ఒక సైబర్ నేరం జరుగుతుందని, సైబర్ నేరం ఎక్కడి నుంచి జరిగింది. నేరం చేసిందెవరని గుర్తించడం, వారిని పట్టుకోవడం, శిక్షించడం వంటి అనేక సవాళ్లతో పాటు అసలు నేరం జరక్కుండా నిరోధించాల్సిన బాధ్యత కూడా పోలీసులపైనే ఉందన్నారు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ఆయా రాష్ట్రాలతో సమన్వయం సాధించడానికి దేశంలో ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్‌లా ఈ సదస్సు ద్వారా ప్రయత్నించడం అభినందనీయం అన్నారు.