తెలంగాణ రెండో విడత రుణమాఫీ నిధులు విడుదలయ్యాయి. మొదటి విడతలో రూ. 11,34,412 రైతులకు రూ. 6034.96 కోట్లు విడుదల చేయగా రెండవ విడతలో రూ. 6,40,223 మంది రైతులకు రూ. 6190.01 కోట్లు జమ చేసింది ప్రభుత్వం. ఇక చివరిదైన మూడో విడతలో రూ. 17,75,235 మంది రైతులకు రూ.12,224.98 కోట్లు జమచేయనుంది.
అసెంబ్లీలో రెండి విడత రుణమాఫీ నిధులను విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 17 మంది రైతులకు సీఎం చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. రుణమాఫీ నిధుల విడుదలతో తన జన్మ ధన్యమైందని ఇవాళ రైతులకు పండగ రోజు అన్నారు. రైతు ప్రయోజనాలే తమ ప్రభుత్వ విధానమని, రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకూడదని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
మొదటి రెండు విడతల్లో కలిపి అత్యధిక రైతు రుణాలు ఉన్న జాబితాలో మొదటి స్థానంలో నల్లగొండ జిల్లా ఉందని చెప్పారు. ఇక చివరి స్థానంలో హైదరాబాద్ జిల్లా ఉందని మొత్తం మూడు దశల్లో రుణమాఫీ ద్వారా 35,49,870 మంది రైతులు లబ్ధి పొందనున్నారని చెప్పారు. మూడు దశల్లో మొత్తం రూ.24,449,95 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు.
రెండో విడత రుణమాఫీ లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతు మేలు కోసం తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని, రైతు రుణమాఫీపై శరవేగంగా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. రెండో విడతలో 6.4 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,190 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు.