సీఎంగా రేవంత్ రెడ్డి దూకుడు మీదున్నారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటు పాలనలో తనమైన మార్క్ స్పష్టంగా చూపిస్తున్నారు. ఓ వైపు ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత,బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై దృష్టి సారిస్తూనే మరోవైపు ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు, 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలను రద్దు చేయడం వరకు తన విధానం ఏంటో తెలియ చేస్తున్నారు.
తాజాగా ఇప్పుడు రేవంత్ దృష్టి అధికార యంత్రాంగంపై పడింది. రేపో మాపో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల ప్రక్షాళన జరగనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న ఏడుగురు మాజీ ఐఏఎస్ అధికారులను తొలగించగా స్పెషల్ ఆఫీసర్ల నియామకాలను కూడా రద్దు చేసింది. బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ నేతలను ప్రధానంగా తనను ఇబ్బందికి గురి చేసిన వారిని టార్గెట్‌గా రేవంత్ మార్క్ స్పష్టంగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పలువురు అధికారులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అధికారల వంతు రావడంతో ఏ శాఖకు బదిలీ అవుతాం? ఒక వేళ పోస్టింగ్ ఇస్తే ఎక్కడ ఇస్తారోననే టెన్షన్ మాత్రం నెలకొంది.
ఇప్పటికే ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చగా 6 గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను అమల్లోకి తీసుకొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. 17 కార్పొరేషన్ల ఛైర్మన్లు తమ పదవులకు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. మొత్తంగా రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాయి.