తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. రోజురోజుకు కనిష్ట స్థాయిలోకి ఉష్ణోగ్రతలు చేరుతుండగా ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 6.2 డిగ్రీలకు పడిపోయింది, పటాన్‌చెరులో 7 డిగ్రీలు, మెదక్‌లో 7.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజేంద్రనగర్ 8.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజుల పాటు గ్రేటర్‌లో ఇదే తరహా పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలం అర్లి(టి)లో అత్యల్పంగా 6.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులతో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతున్నాయి. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్నివస్త్రాలు కొనుగోలు చేస్తున్నారు.ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లా సహా పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.