కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌లో టీడీపీ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ టీడీపీ, ఆ తర్వాఆత నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ఉంది. ఇక ఇటీవల జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేసి దానిని కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇప్పుడు అదే ప్రత్యేక హోదా అంశం ఏపీని తాకింది. కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబు…ఏపీకి ప్రత్యేక హోదా తేవాలనే డిమాండ్ చేయాలనే చర్చ జరుగుతోంది. దీనిపై చంద్రబాబు మౌనంగా ఉండటం సరికాదని, ప్రజలకు సమాధానం చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
గతంలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు అడిగిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కేంద్రంలోని సంకీర్ణ కూటమికి మద్దతు ఉపసంహరించుకుంటామని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సైతం ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రచార అస్త్రంగా ఎంచుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఏపీ సమగ్రాభివృద్ధికి కావాల్సింది ప్రత్యేక ప్యాకేజీలు కాదని, హోదా ఒక్కటే మార్గమని తెలపడంతో ఏపీలో మళ్లీ ప్రత్యేక హోదా చర్చ జరుగుతోంది. మరి దీనిపై చంద్రబాబు, టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.