ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరుగనున్న పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలు, నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని 119 నియోజకవర్గాల నుండి భారీగా జనసమీకరణ చేయనున్నారు. సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సభ విజయవంతంలో వారి భాగస్వామ్యం, అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించిన తగిన సూచనలను ఎప్పటికప్పుడు గులాబీ బాస్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పాలకుర్తిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఎర్రబెల్లి… గతంలో మన సభలకు ఎక్కువ మంది రావాలని రూ.200నుంచి రూ.300 ఇచ్చేదన్నారు. ఈ సభకు ఎంతమందిని తీసుకరావాలని నేను చెప్పనని.. మీరే మీ ఊర్లలలో అనుకూలత మేరకు మందిని తీసుకుని రావాలన్నారు. ఎట్లా వస్తే మంచిదన్నది మీరే నిర్ణయించుకోవాలన్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోయేలా జనసమీకరణ చేయాలని సూచిస్తుండగా ఎర్రబెల్లి మాత్రం స్వచ్చంద జనసమీకరణ మాటలు చెప్పడం గమనార్హం. అంతేగాదు మీ ఇష్టం అంటూ లోకల్ నాయకులకే వదిలేయడంతో ఎర్రబెల్లి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.