నీళ్ల కోసం మరో పోరాటానికి సిద్ధమవుదాం అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. సంగమేశ్వర, బసవేశ్వర సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ నిర్వీర్యం చేసిందని.. ఈ ప్రాజెక్టుల కోసం హరీశ్ రావు పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు హరీశ్ రావు.
ఆ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడదాం.. జహీరాబాద్, సంగారెడ్డి, నారాయణ ఖేడ్, అందోల్ నియోజకవర్గాల బీఆర్ఎస్ కార్యకర్తలను సమాయత్తం చేయండన్నారు. 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఆరాటపడిన కేసీఆర్ గారి ఆకాంక్షను నెరవేర్చుదాం.. రైతులకు మేలు జరిగేలా భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు త్వరలో చేసే పోరాటం గురించి ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్ తో, ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రెండేళ్ల క్రితం 2022 ఫిబ్రవరి 21న నారాయణ్ ఖేడ్ లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసారు. అధికారంలోకి వచ్చి 14నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాజెక్టుల వైపు తొంగి కూడా చూడలేదు అన్నారు.
దీంతో సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్, ఆందోల్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గ ప్రజల సాగు నీరు కలగానే మారిందన్నారు. దీంతో ప్రభుత్వంలో కదలిక తెచ్చి, ప్రాజెక్టులు పూర్తి చేయించి, దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంగమేశ్వర, బసవేశ్వర సాగునీటి ప్రాజెక్టులపై పోరాటానికి సిద్ధం అవుదాం… ఆ దిశగా సంసిద్ధం కావాలన్నారు హరీశ్ రావు.