ఉత్తరాంధ్రలో తన పట్టు నిలుపుకునేందుకు మాజీ మంత్రి, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఇప్పటి నుండే వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లా రాజకీయాలపై పూర్తి ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, ప్రతిపక్ష నేతగా కేబినెట్ ర్యాంకులో ఉన్నారు బొత్స.
ఇందులో భాగంగానే విశాఖ కేంద్రంగా తన కార్యక్రమాలపై స్పీడ్ పెంచేశారు. సొంత ఆఫీసుని ఏర్పాటు చేసుకుని విశాఖ వేదికగానే మీడియా సమావేశాలు పెడుతున్నారు బొత్స. 2029లో జరిగే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారనే టాక్ నడుస్తోంది.
వాస్తవానికి విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు బొత్స. 2029లో చీపురుపల్లి నుంచి తన కుమారుడు బొత్స సందీప్‌ను బరిలో దింపాలని భావిస్తున్నారు. అలాగే గజపతినగరాన్ని తన తమ్ముడికి మిగితా అనుచరులకు సైతం మెజార్టీ సీట్లు దక్కేలా ప్లాన్ సిద్దం చేస్తున్నారు బొత్స. భీమిలి నుండి తన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించడంతో ఆయన పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అప్పగించింది ఫ్యాన్ పార్టీ అధిష్టానం.
పార్టీ అధిష్టానం సైతం బొత్సాకు పూర్తి సేఫ్ హ్యాండ్ ఇవ్వడంతో ఈ సారి విశాఖ జిల్లాలో తన సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు బొత్స. అయితే బొత్స ఎంపీగా పోటీ చేస్తారా లేక..ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారా అన్నది త్వరలోనే తేలనుంది.