తెలంగాణ ఇచ్చిన పార్టీగా పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టగా అధికారంలోకి వచ్చి 9 నెలలు కావొస్తోంది. అయితే ఇప్పటికే కొంతమందికి నామినేటెడ్ పోస్టులు దక్కగా మరికొంతమంది సీనియర్లు ఆశతో ఎదురుచూస్తున్నారు.
ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన కేకే మహేందర్ రెడ్డి. ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలుపు మాత్రం దక్కలేదు. అయినా సరే పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు కేకే. అంతేగాదు రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలతో సత్సంబంధాలు అలానే మెయింటెన్ చేస్తూ వస్తున్నారు కేకే.
ఈ నేపథ్యంలో కార్యకర్తలే కాదు నాయకులు సైతం ఆయనకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ నుండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు మహేందర్ రెడ్డి. 2009లో తొలిసారి అసెంబ్లీకి పోటీ చేయగా కేవలం 171 ఓట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటినుండి పోటీ చేస్తున్న గెలుపు మాత్రం దక్కలేదు. అయితే ఏనాడూ నిరాశ చెందని కేకే…తన వాయిస్‌ని మాత్రం బలంగా వినిపిస్తు వస్తున్నారు.
అయితే కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం కేకేకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని తెలుస్తోంది. త్వరలో ఖాళీ అయ్యే స్థానాల్లో కేకేకు అవకాశం ఇస్తారని హస్తం పార్టీ నేతలే చెబుతున్నారు. మరి ఆలస్యాంగానైనా చట్ట సభల్లో అడుగుపెట్టాలనే మహేందర్ రెడ్డి కోరిక నెరవేరుతుందా వేచిచూడాలి.