టీ20లకు భారత స్టార్ క్రికెటర్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వన్డేలు, టెస్టులకు మాత్రమే విరాట్ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ నేపథ్యంలో విరాట్‌ను మూడు రికార్డులు ఊరిస్తున్నాయి.
త్వరలో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో ఆ రికార్డులను బ్రేక్ చేస్తాడా అని క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు 113 టెస్టులు ఆడిన విరాట్ 8848 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉండగా ఈ రెండు టెస్టుల సిరీస్‌లో కేవలం 52 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ ఆటగాడు గ్రహం గూచ్(8900) పరుగుల రికార్డును అధిగమిస్తాడు.
ఇక ఇదే సిరీస్‌లో 152 పరుగులు చేస్తే తక్కువ మ్యాచ్‌ల్లోనే 9 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా నిలుస్తాడు కోహ్లీ. అలాగే బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో ఒక్క సెంచరీ చేసినా బ్రాడ్‌మన్ రికార్డును విరాట్ (30) సెంచరీలతో బ్రేక్ చేస్తాడు. అలాగే కోహ్లీ 32 పరుగులు చేస్తే బంగ్లాదేశ్ పై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కుతాడు.