ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత దూకుడు పెంచారు. ఓ వైపు పార్టీ అనుబంధ సంఘాలు, పార్టీ అధ్యక్షులను నియమిస్తు వస్తున్న జగన్ మరోవైపు సీనియర్ నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు. టీడీపీ ప్రజా వ్యతిరేక పాలనను ఎండగట్టేందుకు ప్రజాపోరాటలే శరణ్యమని నేతలకు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 4న కీలక సమావేశం ఏర్పాటు చేశారు జగన్.
తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేయగా ఈ సమావేశానికి అన్ని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర రీజినల్ కో ఆర్డినేటర్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పార్టీ కమిటీల ఏర్పాటు, వాటి భర్తీపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు టీడీపీ అనుసరిస్తున్న విధానాలను ప్రజాక్షేత్రంలో ఏ విధంగా ఎండగట్టాలో కీలక సూచన చేయనున్నారు.
ప్రధానంగా కరెంట్ ఛార్జీల పెంపుపై క్షేత్ర స్థాయి ఆందోళనలు చేపట్టాలని సూచించనున్నారు జగన్. అలాగే ధాన్యం సేకరణ, రైతులకు మద్దతు ధర, మిల్లర్లు – దళారులు రైతులను దోచుకుంటున్న విధానం, ఆరోగ్య శ్రీపై చర్చించనున్నారు.అలాగే ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలపై నేతలతో చర్చించనున్నారు జగన్. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంపై కార్యచరణ రూపొందించనున్నారు.
సంక్రాంతి తర్వాత ప్రతీ బుధ, గురువారాల్లో కార్యకర్తలతో భేటీ అవుతానని జగన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్యకర్తల నుండి సలహాలు స్వీకరించనున్నట్లు ప్రకటించగా దీనిపై కూడా నేతలతో చర్చించనున్నారు జగన్.