ఆరు నెలల్లోనే సీఎం చంద్రబాబుపై వ్యతిరేకత మొదలైందన్నారు వైసీపీ అధినేత జగన్. చంద్రముఖిని లేపడమంటే పులి నోట్లో తల పెట్టడమేనని ఆరోజు చెప్పానని, ఈరోజు దాన్ని చంద్రబాబు నిజం చేస్తున్నారని జగన్ విమర్శించారు.ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వంపై రాలేదని అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ నేతలతో జరిగిన భేటీలో వైఎస్ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ వ్యతిరేకత వైసీపీకి అనుకూలంగా మారాలంటే ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేయాలని జగన్ పిలుపునిచ్చారు. ప్రజల తరపున మనం గొంతు విప్పాలని, నాయకులుగా ఎదగడానికి మీకు ఇదొక అవకాశం అని అన్నారు . మన ప్రభుత్వ హయాంలో ప్రతి కుటుంబానికి మనం ఎంతో చేశామని తెలిపారు.
వైసీపీ హయాంలో మేనిఫెస్టోకు పవిత్రతను తీసుకొచ్చామని తెలిపారు. కరోనా వచ్చినా, ప్రభుత్వ ఆదాయం తగ్గినా, ఖర్చులు పెరిగినా సాకులు చూపకుండా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అమలు చేశామని చెప్పారు. ఆరు నెలలు గడవకుండానే చంద్రబాబు మోసాలను ప్రజలు గుర్తించారని చెప్పారు.