మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు మాజీ సీఎం జగన్. విజయవాడ మొగల్రాజపురంలోని జయప్రకాష్ నివాసానికి వెళ్ళిన జగన్ ఆయన చిత్రపటానికి పూలు సమర్పించి, నివాళులర్పించారు. మాజీ శాసనసభ్యుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా జయప్రకాష్ తనదైన ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు.
అడుసుమిల్లి కుటుంబ సభ్యులతో మాట్లాడిన జగన్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 1983-85 మధ్య విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు అడుసుమిల్లి జయప్రకాష్.
హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ర్టో ఎంట్రాలజీలో ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన చికిత్స పొందుతున్నారు. కొద్దిరోజుల క్రితం పరిస్థితి విషమించడంతో మృతిచెందారు. విద్యార్థి సంఘ నాయకుడిగా కాంగ్రెస్‌లో పనిచేసిన అడుసుమిల్లి… ఎన్టీఆర్ పార్టీ పెట్టాక ఆయన పిలుపుతో టీడీపీలో చేరి విజయవాడ తూర్పు శాసనసభ్యునిగా గెలుపొందారు. దివంగత కాకాని వెంకటరత్నం శిష్యుడిగా గుర్తింపు పొందారు.