ఏపీ అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు అబద్దాలు చెప్పారని మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్. అసెంబ్లీలో బడ్జెట్ పై చంద్రబాబు చేసిన ప్రసంగం పచ్చి అబద్దాలు అన్నారు. వైసీపీ హయాంలో అప్పులపై తప్పుడు ప్రచారం చేసి కాలం వెల్లదిస్తూన్నారని దుయ్యబట్టారు.
మెగా డీఎస్సీ పేరుతో గతంలో తాము ఇచ్చిన ఉద్యోగాల్ని సైతం భర్తీ చేయలేని పరిస్ధితుల్లో చంద్రబాబు సర్కార్ ఉందన్నారు. అంతే కాదు తాము నియమించిన వాలంటీర్లను తొలగిస్తున్నారని ….తమ హయాంలో ఆరోగ్య శ్రీలో వైద్యం చేయించుకునే మొత్తం 25 లక్షలకు పెంచామని, కానీ ఇప్పుడు ప్రభుత్వం 108కే జీతాలివ్వడం లేదన్నారు.
బడ్జెట్‌లో ఎన్నికల హమీలైన సూపర్ సిక్స్ పథకాలకు నిధుల కేటాయింపు చేయకుండా చంద్రబాబు తప్పించుకున్నారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా తమ హయాంపై కాగ్ రిపోర్టు వస్తే దానిపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బడ్జెట్ లో ఉచిత గ్యాస్ సిలెండర్ల వంటి చిన్న చిన్న పథకాలకు సైతం నిధులు కేటాయించలేని పరిస్ధితుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఉందని జగన్ ఆరోపించారు. పేదలకు గతంలో ఇంటి స్థలం, ఇళ్లు ఇవ్వని చంద్రబాబు, తాము ఇచ్చిన ఇళ్లు పూర్తయితే పేరు జగన్ కు వస్తుందని ఆపేశారన్నారు. ఎందుకు అసెంబ్లీ నడుపుతున్నారో, ఎందుకు ప్రభుత్వం నడుపుతున్నారో తెలియడం లేదన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే సచివాలయాల్లో లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని, 50 వేల ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలోకి తీసుకున్నామని, 2.66 లక్షల వాలంటీర్లను నియమించామని, కానీ కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక్క ఉద్యోగం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.