తిరుపతి లడ్డూ వ్యవహారంలో అబద్దాన్ని ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోయినా చంద్రబాబుకు ఇంకా సిగ్గురాలేదు అన్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ తో విచారణ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో స్పందించిన జగన్.. సిట్ అవసరంలేదు.. బిట్ అవసరం లేదు.. అసలు ఏం జరగనిదానికి విచారణ ఎందుకు..? జరగనిదాన్ని జరిగిందని పదేపదే ప్రచారం చేసుకుంటున్నారు అన్నారు అని దుయ్యబట్టారు జగన్.
వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. ఏ అధికారులు వచ్చి ఏం చేస్తారు.. తప్పుడు రిపోర్ట్ ఇచ్చినా.. తప్పుడు ప్రచారం చేసినా స్వామివారే చూసుకుంటారు అని తెలిపారు జగన్. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారంతో చంద్రబాబు చేసిన పానం.. అతనికే పరిమితం కావాలన్నారు. తప్పు అని తెలిసినా.. అతడ్ని సమర్థిస్తున్న కూటమి నేతలకే ఆ పాపం పరిమితం కావాలన్నారు.
లడ్డూపై అసత్య ప్రచారంతో చంద్రబాబు తప్పు చేస్తున్నాడని తెలిసినా.. అతడ్ని పవన్ సమర్ధించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. దీనికి సనాతన ధర్మాన్ని ముడిపెట్టడం ఎంత వరకు కరెక్ట్? సనాతన ధర్మమంటే పవన్ కు తెలుసా? ఒక పక్క లడ్డూ ప్రసాదాలపై తప్పుడు ప్రచారం చేస్తూ.. మరోపక్క సనాతన ధర్మం గురించి ఎలా మాట్లాడగలుగుతున్నారు? అని దుయ్యబట్టారు.
మేము ఏ తప్పు చేయలేదు కాబట్టే.. ధైర్యంగా ఆధారాలు చూపిస్తున్నాం లడ్డూపై తప్పుడు ప్రచారం చేసిన వారిని ఆ వేంకటేశ్వర స్వామి తప్పక శిక్షిస్తారు. దేవుడితో ఆటలు ఆడుతున్న కూటమి నేతలకు శిక్ష తప్పదన్నారు. తన తప్పుడు ప్రచారాన్ని సమర్థించుకునేందుకు చంద్రబాబు సిట్‌ను ఏర్పాటు చేశాడు. కానీ.. ఆ సిట్‌ను రద్దు చేయడం ద్వారా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు.