టీడీపీ కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై శంఖారావం పూరించారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. డిసెంబర్ నుండి కార్యాచరణ ప్రారంభించామని చెప్పారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు జగన్.
డిసెంబరు 11న రైతుల తరఫున వారి సమస్యల పరిష్కారానికి.. ర్యాలీగా వెళ్లి అన్ని జిల్లాల కలెక్టర్లకి వినతిపత్రం అందజేస్తాం అన్నారు. కరెంట్ ఛార్జీల బాదుడే బాదుడుపై డిసెంబరు 27న ప్రజలతో కలిసి ర్యాలీగా వెళ్లి.. పెంచిన ఛార్జీలను తగ్గించమని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల ఎస్‌ఈ, సీఎండీ కార్యాలయాల్లో వినతిపత్రం అందజేస్తాం అని వెల్లడించారు.
జనవరి 3న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందజేస్తాం వెల్లడించారు. ఏపీలో అమల్లోకి వచ్చిన కొత్త మద్యం విధానంపై తొలిసారి స్పందించారు జగన్. ప్రభుత్వం నడుపుతున్న బెల్టుషాపులు ఎత్తివేశారు… మొత్తం షాపులన్నింటినీ చంద్రబాబు, ఆయన మనుషులు చేతిలోకి తీసుకున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు. గ్రామంలో వేలంపాటలు పెట్టి బెల్టుషాపులు ఇస్తున్నారు… బెల్టుషాపులు లేని వీధి, గ్రామం లేదు అని మండిపడ్డారు జగన్.
అంతేగాదు ఒక్కో బెల్టు దుకాణానికి రూ.2-3 లక్షల వేలం పాట పెడుతున్నారని…ఏ పని జరగాలన్నా, ఏ పరిశ్రమ నడుపుకోవాలన్నా కమీషన్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.