అకాల వర్షాలు రైతులను నిండా ముంచేశాయి. ముఖ్యంగా అరటి రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో అరటి రైతుల కోసం రంగంలోకి దిగారు మాజీ సీఎం జగన్. వైయస్ఆర్ జిల్లా తాతిరెడ్డిపల్లిలో అకాల వర్షం కారణంగా పడిపోయిన పంటలను జగన్ పరిశీలించారు.
రైతులతో మాట్లాడి వారిని ఓదర్చారు. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె గ్రామాల్లో పర్యటించిన జగన్.. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
లింగాల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురవడంతో 2,460 ఎకరాల్లో అరటి పంట కూలిపోయిందని, 827 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు.
మండలంలోని తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, వెలిదండ్ల, పెద్దకుడాల, కె.చెర్లోపల్లె, రామన్నూతనపల్లె, గుణకణపల్లె, లింగాల తదితర గ్రామాల్లో అరటి పంటలు నేలకూలాయి. పెద్దకుడాల గ్రామానికి చెందిన రామాంజనేయరెడ్డి అనే రైతు మాట్లాడుతూ.. 3 ఎకరాల్లో యాలకి (సుగంధాలు) ,అరటి సాగు చేయగా చేతికొచ్చే సమయంలో నేలకొరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతపురం, వైఎస్‌ఆర్ జిల్లాలో 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది. రెండు జిల్లాల్లోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు.