వచ్చేసారి అధికారం తమదేనని బల్ల గుద్ది మరి మీడియా ముందు చెబుతున్నారు బీజేపీ నేతలు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కొద్దిరోజుల క్రితం ప్రారంభమైన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి ఉన్న సభ్యత్వ నమోదులో మాత్రం వెనుకబడే ఉన్నారు.
వాస్తవానికి 50 లక్షల సభ్యత్వాలు టార్గెట్‌గా తెలంగాణ బీజేపీ ముందుకు సాగగా ఇప్పటికి 9 లక్షలు మాత్రమే చేయగలిగారు. మరోవైపు సభ్యత్వ నమోదు గడువు ముగుస్తుండటంతో బీజేపీ జేపీ నడ్డా..పార్టీ నేతలపై సీరియస్ అయ్యారు. 41 లక్షల సభ్యత్వాన్ని 15 రోజుల్లో పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించారు.
ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు పార్టీకి ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమానం అని…శక్తి కేంద్రాల వేదికగా పార్టీని బలోపేతం చేయండని సూచించారు. సభ్యత్వ నమోదు స్పీడ్ గా కావడం లేదు… ఎందుకిలా? అని ప్రశ్నించారు. అయితే దీనంతటికి కారణం నేతల మధ్య సమన్వయలోపమేనని తెలుస్తోంది. పార్టీలో కొత్తగా చేరిన వారు ఒక వర్గం, పాత వారు మరొక వర్గంగా ఉండగా కొంతమంది నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు. అంతేగాదు ఎమ్మెల్యేలకే పార్టీ సమావేశాలకు సంబంధించిన సమాచారం ఉండటం లేదంటే పరిస్థితి విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.