సీఎం చంద్రబాబు అప్పులపై చెప్పినవన్నీ అబద్దాలేనన్నారు వైసీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జుపూడి.. మెగా డీఎస్సీ పేరుతో మరోసారి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారన్నారు. అదే పనిగా అబద్ధాలు చెప్పడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని అన్నారు.
ఇది పెన్షన్ల పంపిణీనా లేదా పబ్లిసిటీ కోసమా చెప్పాలన్నారు. ఇప్పుడే కాదు 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పెన్షన్ల విషయంలో వృద్థుల పట్ల ఆయన ఏనాడూ మానవత్వంతో వ్యవహరించలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో సామాజిక పెన్షన్లను రూ.3వేలకు పెంచాం అని గుర్తుచేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు పెన్షన్ల సంఖ్యను పెంచుతామని చెప్పి ఇప్పుడు పది లక్షల పింఛన్లకు కటింగ్ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది అన్నారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను గాడిలోపెట్టానని చంద్రబాబు చెబుతున్నారు కానీ స్టీల్‌ప్లాంట్‌లో 40వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు అని మండిపడ్డారు. ఒకవైపు కేంద్రం పెట్టుబడుల ఉపసంహకరణ అని చెబుతుంటే తాను గాడిలో పెట్టానని ఎలా అబద్దాలు చెప్పగలుగుతున్నారు? చెప్పాలన్నారు. ఎన్నికలకు ముందు వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసిందని చెప్పి.. ఇప్పుడమే 12.5 లక్షల కోట్లు అని, మరోసారి రూ.10 లక్షల కోట్లు అని, ఆ తరువాత రూ.9 లక్షల కోట్లు అని తగ్గించుకుంటూ వచ్చారు అని దుయ్యబట్టారు.