సుప్రీం కోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ గా గవాయి నియమితులుకానున్నారు. జస్టిస్ గవాయి పేరును ఖరారు చేసింది కొలీజియం. మే 13న రిటైర్ కానున్నారు జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఆయన రిటైర్మెంట్ తర్వాత గవాయ్ సీజేఐగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2007లో భారత అత్యున్నత న్యాయస్థాన పదవిని చేపట్టిన జస్టిస్ బాలకృష్ణన్ తర్వాత సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న రెండో దళితుడు గవాయ్.
1960 నవంబర్ 24న అమ్రావతిలో జన్మించారు గవాయ్. 1985 మార్చి 16న న్యాయవృత్తిలో చేరారు. 1987 వరకు హైదర బార్ రాజా ఎస్. భోంసాలే (మాజీ అడ్వకేట్ జనరల్ మరియు హైకోర్టు న్యాయమూర్తి)తో కలిసి పనిచేశారు. 1987 నుండి 1990 వరకు బొంబాయ్ హైకోర్టులో స్వతంత్రంగా ప్రాక్టీస్ చేశారు. 1990 తరువాత ప్రధానంగా బొంబాయ్ హైకోర్టు నాగపూర్ బెంచ్‌లో న్యాయవృత్తి నిర్వహించారు.
నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్, అమ్రావతి మున్సిపల్ కార్పొరేషన్ మరియు అమ్రావతి యూనివర్సిటీకి స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. SICOM, DCVL వంటి అనేక స్వయంప్రతిపత్త సంస్థలు మరియు విదర్భ ప్రాంతంలోని మున్సిపల్ కౌన్సిల్స్ తరఫున వాదనలు వినిపించారు.
1992 ఆగస్టు నుండి 1993 జులై వరకు బొంబాయ్ హైకోర్టు నాగపూర్ బెంచ్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ మరియు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. 2000 జనవరి 17న నాగపూర్ బెంచ్‌కు గవర్నమెంట్ ప్లీడర్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు.
2003 నవంబర్ 14న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదవీప్రారంభం చేశారు. 2005 నవంబర్ 12న బొంబాయ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ముంబయి ప్రధాన స్థావరం మరియు నాగపూర్, ఔరంగాబాద్, పణజి బెంచ్‌లలో అన్ని రకాల కేసులపై వాదనలు విన్న బెంచ్‌లకు అధ్యక్షత వహించారు. 2019 మే 24న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2025 నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు.