బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ నిధుల విషయంలో జరిగిన అవకతవకలపై ఏసీపీ దూకుడు పెంచింది. కేటీఆర్‌ను ఏ1గా , ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్,ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి పేరును చేర్చింది. కేసు విచారణ నిమిత్తం ఏసీబీ త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని గుర్తించింది రేవంత్ ప్రభుత్వం. ఈ మొత్తం వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవలే అనుమతులు మంజూరు చేశారు. దీంతో ఇవాళ కేటీఆర్‌పై కేసు నమోదు చేసింది.
2022 నవంబర్‌లో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరంలో ఇండియన్ రేసింగ్ లీగ్ జరిగింది. ఈ రేస్ సందర్భంగా విదేశీ సంస్థకు నగదు చెల్లింపులపై దర్యాప్తు జరగనుంది. హెచ్‌ఎండీఏ బోర్డు, ఆర్థికశాఖ, ఆర్బీఐ అనుమతి లేకుండానే రూ.55 కోట్ల చెల్లింపులు జరిగాయని, దాదాపు రూ.46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన ఆరోపణ. విదేశీ సంస్థకు నగదు చెల్లింపులపై ఏసీబీ విచారణ చేపట్టనుంది.
ఈ-రేసులో జరిగిన అన్ని అంశాలపైన చర్చకు సిద్దంగా ఉన్నాను అని స్పష్టం చేశారు కేటీఆర్. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే… నిజాలు ప్రజలకు తెలియజేయాలన్న చిత్తశుద్ది ఉంటే ఈ-రేసుపైన సభలో చర్చకు పెట్టాలని కోరుతున్నాను అన్నారు.