క్యాన్సర్ మహమ్మారి బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలకు సాధారణంగా గర్భం ధరించిన తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందని వివరిస్తున్నారు. కానీ ఇప్పుడు ఎంతోమంది చదువులు, ఉద్యోగాల పేరుతో పెళ్లి, పిల్లల్ని కనటం వాయిదా వేసుకుంటున్నారు. ఫలితంగా రొమ్ముక్యాన్సర్ ముప్పు పెరుగుతోందని చెబుతున్నారు.
కొన్ని రకాల క్యాన్సర్లు జన్యపరంగా వచ్చినా.. మరికొన్ని మనం చేసే తప్పుల వల్లే వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సుమారు 63శాతం క్యాన్సర్లు నివారించుకోదగినవేనని చెబుతున్నారు వైద్య నిపుణులు. అయితే ముందు జాగ్రత్తలు పాటిస్తే ఊపిరితిత్తి, గొంతు, నోరు, అన్నవాహిక, జీర్ణాశయం, పేగులు, మలద్వార క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చని అంటున్నారు.
ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి… మాంసాహారులైతే మాంసం తీసుకోవడాన్ని తగ్గించుకోవాలి. ఆయా కాలాల్లో దొరికే తాజా పండ్లు తప్పనిసరిగా తినాలి. కూరగాయల్లో, పండ్లలో క్యాన్సర్‌ను నిరోధించే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కారం, మసాలా ఫుడ్‌ను తగ్గిస్తే మంచింది. క్యాన్సర్ల నివారణకు వ్యాయామం చాలా ప్రధానమని.. రోజుకు కనీసం 40 నిమిషాల సేపు వ్యాయామం చేయాలని సలహా ఇస్తున్నారు. పొగాకు, గుట్కా, ఖైనీ వంటివి నమలటం మూలంగానే 33శాతం క్యాన్సర్లు తలెత్తుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.