కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు కావొస్తుంది. సూపర్ సిక్స్ హామీలను పక్కకుపెడితే పేద విద్యార్ధుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయడంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని వైసీపీ నేత మేరుగ నాగార్జున మండిపడ్డారు.
గల్లాపెట్టే ఖాళీ అయ్యిందని, ఏం చేయలేకపోతున్నానని వాపోయారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో చంద్రబాబుకు తెలియదా? చెప్పాలన్నారు. అవగాహన లేకుండానే ఆయన సూపర్ సిక్స్ అంటూ హామీ ఇచ్చారా? అన్ని వర్గాల ప్రజలకు ఆకర్షనీయమైన హామీలు ఇచ్చి, అధికారాన్ని దక్కించుకుని, ఇప్పడు వాటిని అమలు చేయమంటే ఆ నెపాన్ని జగన్‌పై నెడుతున్నారని దుయ్యబట్టారు.
ఫీజుల కోసం కాలేజీ యాజమాన్యాలు చేస్తున్న ఒత్తిడితో విద్యార్ధులు చదువులను వదిలి కూలికి వెళ్ళాల్సిన దారుణమైన పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం కల్పించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ ఇప్పటి వరకు దాదాపు రూ.2800 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను బకాయి పెట్టిందని ఆరోపించారు. ఫీజు బకాయిలపై ఇటీవల వైయస్ఆర్‌సీపీ ఫీజుపోరు ద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చింది దీంతో బకాయిలును విడుదల చేస్తున్నామని ప్రకటించింది తప్ప విడుదల చేసింది లేదన్నారు. ఇప్పటికైనా విద్యార్థులతో రాజకీయాలు చేయకుండా ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.