ఏపీలో వాలంటీర్ వ్యవస్థే లేదని తేల్చేసింది టీడీపీ ప్రభుత్వం. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి.. వ్యవస్థలో లేని వాలంటీర్లకు జీతాల పెంపు ప్రస్తావనే రాదన్నారు. అంతేగాదు ఒకడుగు ముందుకేసి లేని బిడ్డకు పేరు పెట్టమని, మరేదో చేయమని సభ్యులు ఎలా అడుగుతారని అన్నారు.
వాలంటీర్లు ప్రభుత్వ వ్యవస్థలో లేరని, 2023 ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని తెలిపారు. వ్యవస్థలో వాలంటీర్లు లేనందున వారిని గత ప్రభుత్వమే అధికారికంగా కొనసాగించ లేదు కాబట్టి అలాంటి ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు.
మంత్రి సమాధానంపై వైసీపీ సభా పక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లపై ఎన్నికల్లో ఎలా హామీలిచ్చారని బొత్స నిలదీశారు. ఎన్నికల్లో రూ.5వేల గౌరవవేతనాన్ని రూ.10 పెంచుతామని చెప్పారని, వారిని కొనసాగించక పోతే ఇకపై కొనసాగించడం లేదని చెప్పాలన్నారు. వాలంటీర్లను కొనసాగిస్తూ తాము ఉత్తర్వులు ఇవ్వకపోతే మీరు ఇవ్వడంలో అభ్యంతరం ఏముందన్నారు. తాము ఉత్తర్వులు ఇవ్వలేదని వారిని వదిలేయకుండా కొనసాగిస్తూ ఇప్పుడు మీరు ఇవ్వొచ్చన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బొత్స డిమాండ్ చేశారు.