గొల్లపూడిలో 15 రోజుల క్రితం ఒక టీడీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే దానికి నేను, వైయస్ఆర్సీపీ కారణమని ఆరోపిస్తూ పత్రికల్లో వార్తలు రాయిస్తున్నారని ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ మండిపడ్డారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నాపై కేసు పెట్టారని…. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టి, ఎలాంటి విచారణకైనా సిద్ధం అని స్పష్టం చేశారు.
నిజానికి అతడి బలవన్మరణానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులే కారణం అని తెలిపారు. ఆ వ్యక్తి చనిపోయే ముందు చేసిన వీడియోలో కూడా తన మరణానికి కారణం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులేనని పరోక్షంగా చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. ఆ వ్యక్తి తన పార్టీకే చెందిన వారికి రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉందని…. అప్పులు ఇచ్చిన వారంతా దశాబ్దాలుగా టీడీపీకి పని చేస్తున్న వారేనన్నారు.
చనిపోయిన వ్యక్తితో వైయస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి దాదాపు 15 మందికి డబ్బులు ఇవ్వాల్సి ఉందని తెలిసింది… ఆయన ఆస్తి ఎవరికి రాసిచ్చారో విచారణ చేస్తే అసలు నిజాలు బయటకొస్తాయి అని వెల్లడించారు.