తన కుటుంబంలో జనసేన నాయకులు చిచ్చు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. పిఠాపురంలో పవన్‌ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు ముద్రగడ. ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఇవాళ ఆయన కూతురు క్రాంతి వీడియో రిలీజ్ చేయగా దీనిపై స్పందించారు ముద్రగడ.
జనసేన నాయకులు తన కుటుంబంలో చిచ్చుపెట్టారని, అయినా వెనక్కు తగ్గేదిలేదని తేల్చిచెప్పారు. మీడియాతో మాట్లాడిన ముద్రగడ… నా కూతురుతో కూడా నాపై తప్పుడు ప్రచారం చేయించారు. నా కుమార్తెకి ఎప్పుడైతే పెళ్లయిందో అప్పటి నుంచి తను నా ఆస్తి కాదు. నా కుమారుడు మాత్రమే నా ప్రాపర్టీ అని తెలిపారు.
నా కుమార్తెతో ఆమె మామ , జనసేన నాయకులు తప్పుగా మాట్లాడించారు. నేను భయపడే వ్యక్తిని కాదు, భయపడేది లేదు…జగన్‌కు అండగా ఉండేందుకే వచ్చానని తెలిపారు. తన పేరును ముద్రగడ పద్మనాభంగా ఉండాలా లేదా పద్మనాభరెడ్డిగా ఉండాలా అన్నది ప్రజలే నిర్ణయిస్తారన్నారు.