మెగాబ్రదర్ నాగబాబుకు రాజ్యసభ సీటు ఖరారైందా?, త్వరలో భర్తీ కానున్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు ఇవ్వనున్నారా?, పవన్ విజ్ఞప్తికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ మూడు టీడీపీ కూటమికే దక్కనున్నాయి. ఇక ఈ ముగ్గురిలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతుండగా ఆర్ కృష్ణయ్య దారి మాత్రం బీజేపీ లేదా కాంగ్రెస్ అన్నదా తేలాల్సి ఉంది.
ఇక ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. దేవినేని ఉమా,గల్లా జయదేవ్, యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు పేర్లు వినిపిస్తుండగా ఒకటి జనసేనకు దక్కనుందని తెలుస్తోంది. దీంతో తొలిసారి జనసేన పెద్దలసభలో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రధానంగా జనసేన నుండి నాగబాబు పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు చెప్పగా వారు సైతం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల్లో నాగబాబు అనకాపల్లి లోక్‌సభ సీటును ఆశించారు. కానీ కూటమి పొత్తులో బీజేపీకి ఇవ్వగా సీఎం రమేశ్ గెలుపొందారు. త్వరలో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానున్న సంగతి తెలిసిందే.