వాలంటీర్లపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ పెన్షనర్స్ అండ్ ఎంప్లాయీస్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి. వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రశేఖర్ రెడ్డి… గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించాలనే స్ఫూర్తితో అధికారంలోకి వచ్చిన అతికొద్ది కాలంలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా అక్టోబర్ 2న, 2019న గాంధీ జయంతి రోజున ఒకేసారి దాదాపు 15,004 గ్రామ వార్డు సచివాలయాలను ప్రారంభించిన ఘనత నాటి సీఎం వైయస్ జగన్‌కు దక్కుతుందని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలకు తెర తీసిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటై 11 నెలలు గడిచినా ఎన్నికల్లో చెప్పినట్టు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు అని దుయ్యబట్టారు.
ఇన్నాళ్లు ఒక్కో సచివాలయానికి ఒక్కో వీఆర్వో ఉంటే, ఇకపై కొన్ని చోట్ల రెండేసి సచివాలయాలకు కూడా ఒక్క వీఆర్వోనే పని చేయాల్సి ఉంటుంది. రేషనలైజేషన్ పేరుతో పంచాయతీ కార్యదర్శుల పోస్టులను కొన్ని చోట్ల ప్రభుత్వం తీసేసింది అని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచే వలంటీర్లకు గౌరవ వేతనాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి బడ్జెట్ ఆర్డర్ కూడా ఉంది. ఆ శాఖ మంత్రిగా ఉన్న పవన్‌కళ్యాణ్‌కు కనీసం ఆ మాత్రం తెలియకపోవడం విడ్డూరంగా ఉంది అని దుయ్యబట్టారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహనం కోల్పోయి శానిటరీ ఇన్‌స్పెక్టర్ రవిపై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డాడు. …వాస్తవాలు తెలుసుకోకుండా ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుతో ఆ ఉద్యోగి కన్నీటి పర్యంతమయ్యారు అన్నారు. ఎమ్మెల్యే అయినంత మాత్రాన అధికారుల మీద నోరు పారేసుకునే అధికారం గంటాకు ఎవరిచ్చారని చంద్రశేఖర్‌రెడ్డి నిలదీశారు.