ఓ వైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు నటుడు బాలకృష్ణ. తాజాగా తన 109వ చిత్రం ‘NBK109’ కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్ర టైటిల్ టీజర్ కి ముహూర్తం ఖరారైంది.
ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, రెండు భారీ యాక్షన్ గ్లింప్స్ లు అందరినీ కట్టిపడేశాయి. ముఖ్యంగా బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో దర్శకుడు బాబీ చూపిస్తున్న తీరుకి అందరూ ఫిదా అయ్యారు.
కార్తీక పూర్ణిమ శుభ సందర్భంగా, నవంబర్ 15న ‘NBK109’ టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. విభిన్న దుస్తులు ధరించి, ప్రత్యేకంగా రూపొందించిన ఆయుధాలను చేతబట్టిన బాలకృష్ణ లుక్ ఎంతో శక్తివంతంగా ఉంది. నెత్తురంటిన గొడ్డలిని పట్టుకొని, పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో బాలకృష్ణ నిల్చొని ఉన్న రూపం మరో స్థాయిలో ఉంది. ఈ ఒక్క పోస్టర్ సినిమాపై అంచనాలను ఎన్నో రెట్లు పెంచేలా ఉంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం, 2025 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.